Latest News
Thursday 2 April 2015

ఓటమి ఓ మజిలీ

ఓటమి ఓ మజిలీ


మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పుడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. మొన్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తో ఆడి చిత్తుగా ఓడిపోయింది. అంతకు ముందు అవిచ్ఛి న్నంగా ఏడుసార్లు గెలిచింది. అయినా దేశంలో టీవీలు బద్ద లుకొట్టారు. ప్రదర్శనలు చేశా రు. ధోనీ సామర్థ్యం మీదా, టీమ్ అసమర్థత మీదా, కోహ్లీ శృంగారం మీదా దుమ్మెత్తి పోశారు. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకి తమ్ము డు లేడని నానుడి. విజయాన్ని నెత్తిన వేసుకుని గెంతులు వేసేవారు బోలెడుమంది ఉంటారు గానీ, ఓటమిని అర్థం చేసుకుని ఓదార్చేవారు ఒక్కరూ కనిపించరు. అం దుకే ఒకాయన అన్నాడు: ‘అపజయం కారణంగా నిశ్చే ష్టుడిని చేసే నిశ్శబ్దం విజయాన్ని చూసి విరగబడే వెర్రి నినాదాల కంటే పెద్ద పాఠం నేర్పుతుంది’ అని. ఇంగ్లిష్‌లో చెబితే ఇంకా రుచిగా ఉంటుంది- stunning silence of a defeat has taught me more than the rejoicing noise of a success.

 క్రికెట్ అన్నది క్రీడ అని గుర్తుంచుకుంటే రెండేళ్ల క్రితం భారతదేశం బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయిన విష యం గుర్తుకురావాలి. 1971లో అజిత్ వాడేకర్ భారత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ దేశాలతో ఆయా దేశాలలో ఆడి ఘనమైన విజయాన్ని సాధించింది. ముంబైలో అజిత్ వాడేకర్‌కీ, ఆయన టీమ్‌కీ ఘనమైన స్వాగతాన్ని ఇస్తూ మోటార్ కార్లతో ఊరేగించారు. మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పు డు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. విజయాన్ని పంచుకోవడం ‘దొమ్మీ’ ఆవేశం.

 అపజయానికి సాను భూతి ‘పరిణతి’కి సంకేతం. రెండు ఉదాహరణలు: 1962లో జరిగిన సంఘటన ఇది. నేనప్పుడు ఒకానొక దినపత్రికలో పనిచేస్తున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్యకేంద్రం డాక్టరు ఈశ్వరమా ర్తాండ శాస్త్రిగారు. గొప్ప వ్యక్తి. చండశాసనుడు. మిలట రీలో పనిచేసి వచ్చారు. మాట కటువు. కాని మనసు వెన్న. నాకూ ఆయనకీ తేలికగా 30 సంవత్సరాల దూ రం. అయినా మేమిద్దరం మిత్రులమయ్యాం. ఆయన డ్యూటీలో లేనప్పుడు ఒక విద్యార్థి ఏదో బాధతో అసు పత్రిలో చేరాడు. మందులిచ్చారు. పరిస్థితి అర్థమయ్యే లోగా ఆ కుర్రాడు కన్నుమూశాడు. దానికి శాస్త్రిగారి బాధ్యత బొత్తిగా లేదు. తీరా ఆ కుర్రాడు హాస్టల్‌లో ఉన్న వాడు కాదు. సరే. డాక్టర్‌ని బర్తరఫ్ చెయ్యాలని కొందరు విద్యార్థులు పెద్ద అల్లరి చేశారు.

 అప్పటి వైస్‌చాన్సలర్ ఏఎల్ నారాయణగారు. నిజాయితీపరుడూ, ముక్కుకు సూటిగా పోయే శాస్త్రి గారి మనసు గాయపడింది. వైస్ చాన్సలర్ నిర్ణయానికి ముందే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయనకి జరిగిన అన్యాయాన్ని గురించి ఆ రోజుల్లో హిందూ పత్రిక సంపాదకీయం రాసింది. నేనప్పుడు చిత్తూరులో పనిచేస్తున్నాను. విష యం తెలుసుకుని బాధపడి విశాఖపట్నం వస్తూనే ఆయ న్ని చూడడానికి వెళ్లాను. గొంతు ఆవేశంతో పూడుకు పోగా ఒకమాట అన్నారు: ‘మారుతీరావుగారూ! మీరు వచ్చి పలకరించకపోతే నేను చాలా బాధపడేవాడిని’ అంటూ జర్మనీ నుంచి ఒక మిత్రుడు రాసిన ఓదార్పు ఉత్తరాన్ని చదివారు. ‘డియర్ మార్టిన్! (మార్తాండశాస్త్రి ని అలా పిలిచేవారు) సంవత్సరాల క్రిందట ఓ మహా త్ముడిని అన్యాయంగా సిలువ ఎక్కించారు. మానవ స్వభావం అప్పటికీ ఇప్పటికీ మారలేదని మీకు జరిగిన అన్యాయం రుజువు చేస్తోంది.’ కష్టంలో ఉపశమనం ప్రాణవాయువు.

 అపజయంలో అండగా నిలిచిన గొప్ప ఉదాహ రణ. మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయారు. దారుణంగా పరాభవం పాలయ్యారు. కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు. అప్పుడు ఏకఛత్రాధిపతి సుయో ధనుడు. అయినా ధర్మం అడవుల పాలైంది. రుషులు ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుని సందర్శించి గాయపడిన మనస్సుకీ, జరిగిన అన్యాయానికీ, జరిగిన అనర్థానికీ అనునయంగా -గతంలో అంతకన్నా ధర్మానికి నిలబడి కష్టాలపాలయిన హరిశ్చంద్రుడు, నల మహారాజు వం టివారి చరిత్రలను ఉటంకించి వారిని సముదాయిం చారు. అది పరిణతికి పరాకాష్ట. సమాజంలో మేధావి కష్టంలో అండగా నిలవడం రుషిత్వం-అన్నది పురాణం.

విజయం మన అహంకారాన్ని రెచ్చగొడుతుంది. అపజయం-నిజమైన హితులెవరో తేల్చి చెప్తుంది. చైనాలో ఒక సామెత ఉంది. పెద్దలు దుమ్ము పడిన ముఖాన్ని కడుక్కుని శుభ్రంగా ఉందో లేదో అద్దాన్ని చూస్తారు. కాని పసివాడు ముఖాన్ని తుడుచుకున్న తువాలును చూస్తాడు. క్రికెట్‌లో ఓటమి బాధాకరమే- దేశంలో అందరికీ. కాని ఆ విజయాన్నీ, ఓటమినీ ఆనాటి తమ ప్రయత్నంతో మాత్రమే కాక, ఆనాటి ఎదుటి టీమ్ సామర్థ్యానికీ చోటు కల్పించే అభిమాని విచక్షణ- ఆటగాడి అద్భుతమైన కవచం.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఓటమి ఓ మజిలీ Rating: 5 Reviewed By: DMM