Latest News
Monday 5 January 2015

చివరి శ్వాస దాకా అన్నయ్య మాటలు గుర్తుంటాయి - పవన్‌కల్యాణ్‌

చివరి శ్వాస దాకా అన్నయ్య మాటలు గుర్తుంటాయి - పవన్‌కల్యాణ్‌


‘‘అన్నయ్య (చిరంజీవి) రమ్మనడంతో ఊరినుంచి హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడకు వచ్చాక యోగ, ధ్యానంలో మునిగిపోయి ఏమీ పట్టించుకునేవాణ్ణి కాదు. అన్నయ్య ఏం చెస్తున్నావని అడిగినప్పుడల్లా యోగ, ధ్యానం చేస్తున్నానంటూ, ఆయన్ని కూడా చెయ్యమనీ సలహా ఇచ్చేవాణ్ణి. దాంతో ఓసారి ‘కష్టపడే అన్నయ్య, వండిపెట్టే వదిన ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అప్పుడు నువ్వు ఎన్ని కథలైనా చెప్తావు. నీ వంతు కృషిచేసి, ఏదైనా సాధించినప్పుడు నీకు బాధ్యతనేది తెలుస్తుంది’ అన్నాడు. అన్నయ్య చెప్పిన ఆ మాటలు చెంపమీద కొట్టినట్లు అనిపించింది. సినిమాల్లో కష్టపడి సాధించిన తర్వాత అన్నయ్య మాటల్లోని నిజం అర్థమైంది. చివరి శ్వాస వరకూ ఆ మాటలు గుర్తుంటాయి’’ అని చెప్పారు పవన్‌కల్యాణ్‌. దేవునిగా ఆయన కీలక పాత్ర చేసిన చిత్రం ‘గోపాల గోపాల’. వెంకటేశ్‌ ప్రధాన పాత్ర చేసిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకాలపై డి. సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి. రామానాయుడు సమర్పిస్తున్నారు. కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చిన పాటలు లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌, వెంకటేశ్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. శ్రమ, కృషి మన చేతుల్లో ఉంది. దేవుణ్ణి నేను నమ్ముతాను. అయితే నిరాకారుడైన దేవుణ్ణి నమ్ముతాను. నాకోసం నేనెప్పుడూ దేవుణ్ణి ఏ కోరికా కోరుకోలేదు. ఒక్క హిట్టియ్యమని మాత్రం ఒక్క కోరిక కోరుకున్నా. నితిన్‌ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఆడియో వేడుకకు వచ్చి వెళ్తుండగా, అభిమానులు నా కారుకు అడ్డంపడి, ‘అన్నా ఒక్క హిట్టియ్యన్నా. రోడ్డుమీద తలెత్తుకు తిరగలేకపోతున్నాం’ అని వేడుకున్నారు. చాలా బాధనిపించింది. ఇప్పుడు వరుస హిట్లొచ్చాయి. అభిమానులు నా మీద చూపించే ప్రేమ, ఆప్యాయతకు భగవంతుడు కరుణించాడు. వెన్నుచూపడం నాకు తెలీదు. నేను సినిమాల్లోకి రాక ముందునుంచీ వెంకటేశ్‌గారితో నాకు అనుబంధం ఉంది. ఎప్పట్నించో ఇద్దరం కలిసి సినిమా చెయ్యాలనుకుంటున్నాం. మేం కలిసినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. బహుశా ఈ సినిమా చెయ్యడానికి అదే కారణం అనిపిస్తోంది. ఇందులో దేవుడి కేరక్టర్‌ చేశాను. అందుకని ఒళ్లు దగ్గరపెట్టుకొని చేశాను. డాలీ మంచి దర్శకుడు. ఈ చిత్రాన్ని అతను తెరకెక్కించిన విధానం నచ్చింది. రాబోయే రోజుల్లో అతనితో ఓ సినిమానీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతంతో ఓ సినిమానీ చేస్తాను. సాధారణంగా పాటల్లో ఎక్కువగా నేను నడుస్తుంటాను. ఇందులో కాస్త కాలు కదిపాను’’ అని చెప్పారు.

వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో నాది సింపుల్‌ కేరక్టర్‌. పాటలు బాగా వచ్చాయి. పవన్‌కల్యాణ్‌ అంటే పవర్‌స్టార్‌ కాదు, సూపర్‌ పవర్‌స్టార్‌ అని ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా చెయ్యడానికి కల్యాణ్‌ ఒప్పుకోవడం గొప్ప విషయం. మీ పవరూ, మా విక్టరీ కలిపి ఈ సంక్రాంతికి పవర్‌ఫుల్‌ విక్టరీ చెయ్యాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డి. సురేశ్‌, శరత్‌మరార్‌, కిశోర్‌, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, తివిక్రమ్‌, దిల్‌ రాజు, జెమిని కిరణ్‌, ఎడిటర్‌ గౌతంరాజు, గేయ రచయిత అనంత శ్రీరామ్‌, సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా తదితరులు పాల్గొన్నారు.

Source:http://www.andhrajyothy.com/Artical.aspx?SID=73803&SupID=24
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: చివరి శ్వాస దాకా అన్నయ్య మాటలు గుర్తుంటాయి - పవన్‌కల్యాణ్‌ Rating: 5 Reviewed By: DMM